సైన్స్ మిర్చి - ఇది చాలా ఘాటు గురూ !
వివర్తనమా!
ఏమా నర్తనం? ***** అవరోధాల అంచుల దగ్గర నేర్పుగ వంగే కాంతీ! తిన్నగా వెళ్లే నీకూ అడ్డుగా ఏమన్నొస్తే వంగి తొంగి చూస్తావులే! మబ్బు చాటుకి చేరిన భానుడు వెండి పూత పూసి అంచులు ధగధగలాడిస్తావూ! దీపాల చుట్టిన మంచులో రంగుల వలయాల హేలా! సీడీలపై అనేకానేక వర్ణ కేళీ ఆడెదవే కాంతీ! దినకరుని కరోనా గ్రహణ సమయాన చూపించే వివర్తనమా నీలో వ్యతికరణమూ దాచుకోంటివా వివర్తనమా నీ సొగసు చూడతరమా! - భాను.సి.పవని |
ఆహా నువ్వే నువ్వే
హై హై హైడ్రోజనూ! ఆవర్తన పట్టీలో మొదటిదానవే భలే చిన్నదానివే నీటినీ నీటుగా ఆక్సిజనుతో తోడుగా ఏర్పరుస్తావే! కానీ అదే నీటిలో కరగమంటే కరగవే! కావెండిష్షూ కలల పంటవే! సంలీనంచెందే చక్కనిదానవే చుక్కల్లోనఉన్నదానవే! న్యూట్రానూ లేనట్టీ చిట్టిదానవే నువ్వొక్కదానివే దహనశీలవే!నువ్వూ నీలంలోన మండీ టప్పూమంటావే టప్పుటప్పుటప్పోరివే! నీవ్యాపన రేటూ వాయువుల్లో గ్రేటూ!! ద్రవరూపంలోకి మార్చేసీ ఎగరేసేరూ రాకెట్టూ! రంగూరుచీవాసనా ఏ కోశానా లేనిదానవే శానా శానా విషయమున్నదానివే! వనస్పతీ ,అమ్మోనియా వెల్డింగూ వగైరా నువ్వే దిక్కులే! పెరాక్సైడూ ప్రొపెల్లెంటూ నువ్వే దిక్కులే - భాను.సి.పవని |
గడ్డాన్ని అందంగా తీసేసేటందుకు కావాలోయ్
సమతలాదర్పణం! పుచ్చినా పన్నునూ చూచుటకు కావాలోయ్ పుటాకార దర్పణం! హోయ్ ఒహోయ్ హోయ్ వెంబడించు వాహనాలనూ వాటంగా చూపునోయ్ కుంభాకార దర్పణం!!! - భాను.సి.పవని |
గాలివేగం మాటిమాటికీ మారిపోదా మూడింటిలో తేడాలతో!!!
హీటూ , డెన్సిటీ మరియూ ముచ్చటగా మాయిశ్చరూ లతో!! హీటు తోటి పెరుగునంటా! మరి డెన్సిటీ తోన తగ్గునంటా!! తేమశాతం పెరిగెనా వడి వడిగా పరిగెత్తునంటా! యానకమూ ఎలాంటిదో దానిమీదా ఆధారపడునటా!! ఘనమైతే ఘనమంట ద్రవమయితేతగ్గునంట వాయువయితే మరీ లెస్సూ! అంతరిక్షంలోకెళ్తే అసలుకే ఉండదటా!! - భాను.సి.పవని |
శాస్త్రం లో మధురిమలు
********************* తుషార బిందువులు ప్రత్యూష పవనాలు పొగమంచు వీచికలూ మురిపించే మరీచకలూ మంచుక్రింద జలకాలాడే జలచరాలు తూర్పు సింధూరాలు నీలిరంగు పులుముకున్న ఆకాశాలు విరిసిన హరివిల్లు అందాలు ప్రకృతి సహజ సోయగాలు స్థితి మార్పు వల్ల కలిగే సౌందర్యాలు ప్రతిబింబ విన్యాసాలు సృష్టి లోని ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు అన్నింటిలో దాగున్న సూత్రాలు భౌతిక రసాయనశాస్త్ర విశేషాలు చూసినపుడు మదిలో ఎన్నెన్ని సరిగమలు.. పిల్లలకు తెలిపేటప్పుడు ఎంతెంత మధురిమలు.. - గంజాం భ్రమరాంబ |
నువ్వంటే నాకు
చాలా ఇష్టం రోజుకు ఒక్కసారైనా నీ చెంతకు వస్తాను నిన్ను చూస్తాను ఆశ్చర్యం నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఎంత అద్భుతం నీలో నన్ను చూపుతావు నీవు నీవు నన్నే కాదు ఎవరినైనా నీలోన చూపగలవు అంత గొప్పదానవు నిన్ను చూడగానే అనిపిస్తుంది నీవు నాకేదో తెలపాలనుకుంటున్నట్టు నీవో తత్త్వవేత్తవనీ నా భావన పెద్దలంటారు గదా ప్రవర్తన అనే అద్దంలో ప్రతీ ఒక్కరి ప్రతీబింబం ఉంటుందనీ నిజమే అద్దం అంటే దర్పణం సాధారణంగ అద్దమంటే సమతల దర్పణం వేప విత్తులు వేసి మామిడి కాయలు ఆశించలేమనే సత్యాన్ని చాటుతావు పతన కాంతి ఏ లక్షణమైతే పరావర్తన కాంతి అదే లక్షణం సమాంతరమైతే సమాంతరం కేంద్రీకృతమైతే కేంద్రీకృతం వికేంద్రీకృతమైతే వికేంద్రీకృతం కంటికి కన్ను పంటికి పన్ను సామెత నీవేరుగుదువా మంచీ చేస్తే మంచి చేయడం చెడు చేస్తే చెడు చేయడం అని పరోక్షంగ సూచనలిస్తున్నావు నీపై ఏ రకమైన కాంతిని పతనం చెందిస్తే అదే రకమైన కాంతిని పరావర్తనం చెందిస్తావు తత్త్వసారమెరిగి ధర్మో రక్షతి రక్షితః అని గుర్తు చేస్తున్న సమతల దర్పణమా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నన్ను నాకు చూపెడతావు - వి.నాగమూర్తి |
ప్రపంచంలో
ఎక్కువ తక్కువ భేదాలు ఉన్నవారు లేనివారనే తారతమ్యాలు ఉన్నాయి అందరినీ సమం చేయడం ఎవరివల్లా సాధ్యం కాదు నువ్వు తామరాకుపై నీటీ బొట్టులా అంటీ అంటక ఉంటావు నీ దూరంగా ఉన్నవారున్నా ఖాతరు చేయవు నీ దూరంగా లేనివారున్నా పట్టించుకోవు కానీ ఉన్నవారిని లేనివారినీ కలిపి కూర్చోబెడితే వారిద్దరినీ సమం చేసే దాక నీ ప్రయాణం ఆపవు ప్రపంచంలో పక్కపక్కన ఉంచబడిన ఏ రెండు వస్తువులలో ఉష్ణోగ్రతనైనా సమపరచి రెండింటినీ సమదృష్టితో చూడగల తత్త్వం నీ సొంతం ఓ ఉష్ణమా నీకు నీవే సాటి సమదృష్టిలో నీకు లేరు పోటీ - వి.నాగమూర్తి |
నేను...
విద్యార్థులకు స్ఫూర్తి కలిగించడానికి.. సైన్స్ పట్ల..ఆసక్తి కలగించడానికి.. నిజాన్ని నమ్ముతాను ఊహను గౌరవిస్తాను శాస్త్రీయంగా ఆలోచిస్తాను కొత్తదనాన్ని ఆహ్వానిస్తాను విస్తృతంగా చదువుతాను సూక్ష్మంగా పరిశీలిస్తాను ప్రయోగాలను నిర్వహిస్తాను ఫలితాలను విశ్లేషిస్తాను. శాస్త్రజ్ఞుల గురించి తెలుపుతాను వారి అలుపెరుగని కృషిని చూపుతాను పురోగమనం సైన్స్ తోనే సాధ్యం అనీ సైన్స్ లేకుంటే తిరోగమనమే మిగులునని ఉదాహరణలతో వివరిస్తాను నిత్యజీవితంలో అనువర్తిస్తాను ప్రకృతిని ఆరాధిస్తాను కాలుష్యాన్ని తగ్గిస్తాను. సహనంతో సాధిస్తే.. అసాధ్యం అనేది లేదని... విపులంగా చర్చిస్తాను. సైన్స్ పట్ల పిల్లలకు ఇష్టాన్ని కలిగిస్తాను సైన్స్ ప్రయోగశాలను వినియోగిస్తాను పిల్లలతో ప్రయోగాలు చేయిస్తాను వివిధ సైన్స్ కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తాను వారి బుజ్జిబుర్రలలో.. కొత్త ఆలోచనలు రూపొందేలా వారికి సాయపడుతాను.. కేవలం మార్కులకోసమే కాదు అవధులు లేని సంతోషంకోసం.. ఇవన్నీ నేను చెప్పుకునే గొప్పలు.. కావు సుమండీ.. ఎన్నెన్నో.. చెయ్యాలనుకోని చేయలేక పడుతున్న తిప్పలు.. ఈసారైనా... నా ఆశలు నెరవేరి.. విద్యార్థుల ఆశయాలను.... సరికొత్తగా స్వాగతించాలనీ.. సమస్యలు ఎన్ని ఎదురైనా.. దీటుగా ఎదుర్కోవాలని.. నూతన విద్యాసంవత్సరానికి ఆశావహ దృక్పథం తో సుస్వాగతం పలుకుతున్న.. - గంజాం భ్రమరాంబ |
ఎవరు దగ్గరైనా
పొంగిపోకు ఎవరు దూరమైనా కుంగీపోకు అంత మాత్రాన నీ ధర్మం మరువకు స్థిరచీత్తంతో ఉండు అనే అద్భుత భావనను తెలియజేస్తావు కుంభాకార దర్పణమా వస్తువు స్థానంతొ సంబంధం లేకుండా ఎల్లవేళలా ప్రతిబింబాన్ని సమాన లక్షణాలతో ఏర్పరిచే నీ ధర్మం విలక్షణం చిన్నదైన నిటారైన మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచెదవు స్థిత ప్రజ్ఞతకు మారు రూపుగ ఉంటావు నీ మార్గంలో జీవనం ఎందరకు సాధ్యం - నాగమూర్తి |
బలాల బలగాలతో
ఘర్షణల సెగలనే చతురతల కందెనలనే అద్ది ప్రగతి రథచక్రాలనే నడిపిద్దాం క్షేత్ర బలాల తాడనముతో సమష్టి కృషి ఫలితాలనే సాదిద్దాం స్పర్శాబలాలకే స్ఫూర్తినింపి చదువుల బండిని నడిపిద్దాం తన్యతలకు తావులేకుండా తనువులుతో బాటు మనసులూ పెట్టి నిరంతర విజ్ఞాన జిజ్ఞాసనే పెంపొందిద్దాం ఆకర్షణల వికర్షణల ఆకలింపులతో ఆటల్లో పాటల్లో అలవోకగా అర్థం చేసుకోని చదువులు వెలిగేలా అవకాశం కల్పిద్దాం ఫలిత బలాల నైపుణ్యాలనే శాస్త్రీయతనే జోడించి అంచనాలే వేసేసి ఆత్మబలాన్నే నింపేద్దాం🙏🏼 - ప్రభాకర్@పలకరింపుల |
మీ విశిష్టోష్ణం తో
సమానమయ్యేలా నా ధర్మాలను మార్చుకుంటా... శక్తిమయ ప్రపంచంలో తుషారంలా విహరిస్తా... మేధస్సునంతా మరిగించి భాష్పీభవనం చెందేస్తా ఘనీభవించిన హృదయాలలో ఆర్ద్రత నింపేస్తా.... ఆనందాన్ని పంచేస్తూ సమతాస్థితి సాధిస్తా. - నాగ ప్రకాష్ స్వర్ణ |
ప్రాతఃస్మరణీయులెవరు?
క్షిపణిపితామహా కలాంజీ వందనం అంతరిక్షరంగపితా విక్రమ్ సారాభాయ్ అభివందనం అణురంగ పితా హోమీజేభాబా నమస్సులూ! హరితవిప్లవసారధీ స్వామినాధన్ నీకు వందనం పక్షిశాస్త్రపితా సలీంఅలీ నీకు అభినందన మందారమాల! రామనూ,రామానుజనూ! యల్లాప్రగడా,మోక్షగుండం!! ఎందరో మరెందరో అందరికీ వందనం మీ స్ఫూర్తి అజరామరం! - భాను.సి.పవని |
సోమవారపు ఆరంభం
ఉష్ణకాలపు సెగలనుంచి వర్షకాలపు జల్లుల జడికై నూతన విద్యా వత్సర బడికై ఆటల పాటల పాఠాలు వల్లించి కృత్యాల ప్రయోగాల పరిశోధనలు చేయించి రేపటి తరాల రాతలను సరిజేస్తూ సరిజూస్తూ భావి భవితకు ఆశలకు బాటలు వేయిస్తూ భరతావని భవితకు అందిద్దాం చతురత కల్గిన సైన్యాన్నే... - ప్రభాకర్@పలకరింపుల |
నేను భగ్గుమందు
నిల్వనుందు కీర్సనాయిలందు. నాకు ఎక్కువైన ఒకటి ఇచ్చుకుందు నీటి యందున్న క్రిముల చంపుదాని ప్రేమగా పెనవేసుకొందు. రూప లావణ్యముల మార్చి ఇద్దరమ్ము రుచిని కూర్చెదము ఇది అయానికమ్ము - నాగ ప్రకాష్ స్వర్ణ |
ఆమ్లజని-ఆమ్లమును పుట్టించును
ఉదజని-ఉదకమును పుట్టించును నత్రజని-నత్రితమును పుట్టించును జనితములకు కారణమే వాయువులన్నీ! - భాను.సి.పవని |
అహోరాత్రులూ కఠినంగా
శ్రమించీ ఎన్నో కనిపెట్టును విజ్ఞాని! అప్పనంగా అన్నింటినీ అనుభవిస్తూ అందులో లోపాలెంచును ఓ అజ్ఞాని!! - భాను.సి.పవని |
సైన్సు కలిగించాలి కొత్త సెన్స్
పెరగాలి మన జ్ఞానపు సెన్స్ ఎవరు వుండరాదు సైలెన్సు అందుకోవాలి చుక్కలు చూసే లెన్స్ అంతరిక్షమే ఇవ్వాలి మనకు లైసెన్స్ ఎవరు కాకూడదు న్యూసెన్స్ - శివ కృష్ణ |
జీవం ప్రారంభం,
జీవం మనుగడ, జీవం అంతం, జీవనిర్జీవ అనుబంధం చూపే వింతల లోకం నాలోకం. - చందు, రాయల్ పేట |
మూఢంగానమ్మకుదేన్నీ!
విజ్ఞానమయమేనోయ్ అన్నీ! - భాను.సి.పవని |
ఉప్పుకినిప్పుకి పడదంట
చిటపటలంటేనేసైన్సంట! - భాను.సి.పవని |
అంతా ప్లాస్టిక్ మయం
*************** ఏ నిమిషాన ప్లాస్టిక్ జన్మించిదో కానీ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది ఇందుగలదు..అందు లేదనుచు ఎందెదు వెతికిన అందందుకలదు ఇంటిలో..బడిలో..దేవుని గుడిలో.. మార్కెట్లో.. షాపింగ్ లో..షిప్పింగ్ యార్డ్ లో.. ముసలీ..ముతకా.. యువతా...జనతా.. అందరి చేతుల్లో.. అంతా..ప్లాస్టిక్ మయం భూమిలో పూర్తిగా కలిసిపోవడానికే లక్షల సంవత్సరాలు పడుతుందని తెలియని అమాయకజీవులు నెమరవేయడానికి ప్రయత్నించి వింత రోగాల పాలవుతున్నాయి. కాల్చితే గాలి కాలుష్యం పూడ్చితే భూమి కాలుష్యం అని తెలిసినా... ఉబ్బడిముబ్బడిగా ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిని ఆక్రమించేస్తున్నాయి. చంద్రమండలంపై ఇతర గ్రహాలపై ప్లాట్ల రేట్లను విపరీతంగా పెంచేస్తున్నాయి భూమిని ఒక అగ్నిగోళంగా మార్చేసి ఇతర గ్రహాలపై ఆవాసాలు వెతుకుతున్న మహా మేధావి వర్గమా... మమ్మల్ని ప్లాస్టిక్ నుంచి కాపాడండి ఇప్పటికే ప్లాస్టిక్ మా పెదవులపై చిరునవ్వు గా మారింది మా మనసులోనికి జొరబడిందా ప్లాస్టిక్ మనుషులుగా మారే ప్రమాదమూ ఉంది.. ప్లాస్టిక్ ను ఒక వస్తువుగానే ఉంచుదాం మనం మంచి మనుషులుగానే మిగులుదాం - గంజాం భ్రమరాంబ |
ఎరక్కపోయివచ్చా
నిందులోకి తన్ను విడదీసి వంచేసి తుంచేసింది ఏడు ముక్కలై ఏడుస్తూ బయటకొచ్చిన కాంతి మొహం వెలిగిపోతోంది ఏడు రంగులతో పట్టకానికి పట్టరాని సంతోషంతో వీడ్కోలు చెపుతూ సప్త దారుల్లో వెళ్ళిపోయింది - నాగ ప్రకాష్ స్వర్ణ |
నిక్షేపంలాంటి తెల్లని కాంతి పట్టకం పుణ్యమాని
విక్షేపణం చెందినా ఏడు రంగుల దర్శనమాయె! ఇదియే కాంతి మాయ! అయినా అది దాని ధర్మమని తలచ మనసంతా హాయి నిండే సప్తవర్ణ శోభితమై! - భాను.సి.పవని |